ఇంటర్ అడ్మిషన్లపై గందరగోళానికి తెర.. యథాతథంగా ప్రవేశాలు!

  • ఈ ఏడాదికి ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ యథాతథం
  • సాంకేతిక సమస్యల కారణంగా పాఠశాల విద్యలో విలీనం వాయిదా
  • సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
  • విలీనంపై కమిటీ అధ్యయనం, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం
  • అధికారుల పనితీరుపై సమీక్షలో అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటం, అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాఠశాల విద్య తర్వాత డ్రాపవుట్లను తగ్గించేందుకు, సీబీఎస్ఈ తరహాలో 11, 12 తరగతులను పాఠశాలల్లోనే నిర్వహించాలని విద్యా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. దీంతో ఇటీవల విడుదల చేసిన ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను బోర్డు రద్దు చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విలీన ప్రక్రియకు సమయం పడుతుందని, అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. చివరి నిమిషంలో సమస్యల గురించి చెప్పడంపై అధికారుల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే అడ్మిషన్లకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

విలీన ప్రక్రియపై విస్తృతంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎడ్యుకేషన్ పాలసీ కమిటీని సీఎం ఆదేశించారు. ఆ నివేదికపై శాసనసభలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించింది. ఈ నిర్ణయం పట్ల ఇంటర్ విద్యా జేఏసీ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం హర్షం వ్యక్తం చేశాయి.

Revanth Reddy
Telangana
Intermediate Admissions
Education Policy
School Education
CBSE
Junior Colleges
Education Commission
Higher Education

More Telugu News